నల్గొండ అర్బన్, వెలుగు : బ్యాంకుల్లో రూ.10 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు జరిగితే ఇన్‌కం టాక్స్ డిపార్ట్‌మెంట్, జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎల్డీఎం శ్రామిక్‌తో కలిసి బ్యాంక్ కంట్రోలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు బ్యాంక్ అకౌంట్లు త్వరగా తెరచి మానిటరింగ్ చేయాలని సూచించారు.
యూపీఐ ద్వారా లావాదేవీలు, అనుమానాస్పద లావాదేవీలపై ప్రతి రోజు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. బ్యాంక్ లు ఒక బ్రాంచ్ నుంచి మరో బ్రాంచికి నగదు పంపేటప్పుడు, ఏటీఎంలో లోడింగ్ చేసేటప్పుడు సరైన డాక్యు మెంట్లు, గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని అన్నారు.
మీడియా సెంటర్, కంట్రోల్ రూమ్ ఓపెన్
కలెక్టరేట్‌లోని జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ సెల్‌ను బుధవారం కలెక్టర్ కర్ణన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీడియా కవరేజ్‌లో లో భాగంగా సంబంధిత అధికారులు మీడియా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని రోజువారి సమాచారాన్ని అందజేస్తారని చెప్పారు. ప్రకటనలు, ప్రచారాలపై మీడియా సర్టిఫికేషన్ , మానిటరింగ్ కమిటీ నిఘా పెట్టాలని ఆదేశించారు.
అంతకుముందు ఎన్నికల కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేయాలంటే 1950, 1800 425 1442 నెంబర్ల ఫోన్ చేయవచ్చని సూచించారు. పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ కోటేశ్వర రావు, డీపీఆర్‌వో పి.శ్రీనివాస్, జిల్లా ఇన్ఫర్మేటిక్ ఆఫీసర్ గణపతి పాల్గొన్నారు.
రూల్స్ మేరకు పనులు చేయడి
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రూల్స్ మేరకు అభివృద్ధి పనులు నిర్వహించాలని కలెక్టర్ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. ఇప్పటికే మొదలు పెట్టిన పనులను కంటిన్యూ చేయాలని, ప్రారంభించని వాటిని కోడ్ ముగిసే వరకు వాయిదా వేయాలని సూచించారు. ఇరిగేషన్ శాఖ పరిధిలోని ప్రాజెక్టుల రిపేర్లను ఈసీ అనుమతితో చేపట్టవచ్చన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి సభలు పెట్టి ప్రచారాలు చేయొద్దని, పోస్టర్లు, బ్యానర్లు, స్టిక్కర్లు అంటించొద్దని ఆదేశించారు. ఈ సమావేశంలో సీపీవో బాలశౌరి, ఆర్‌అండ్‌బీ ఈఈ నరేందర్ రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ముజీబుద్దిన్, పీఆర్ ఎస్ఈ తిరుపతయ్య పాల్గొన్నారు.