నల్గొండ అర్బన్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున లైసెన్స్ ఉన్న ఆయుధాలను వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి కర్ణన్, ఎస్పీ అపూర్వ రావు ఆదేశించారు. గురువారం కలెక్టర్, ఎస్పీలతో కూడిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం బ్యాంక్ లలో రక్షణ, క్రీడా ఈవెంట్ల కోసం తప్ప మిగతా వ్యక్తులు తమ ఆయుధాలు డిపాజిట్ చేయాలని సూచించారు. ఆయుధాలు, డిపాజిట్ చేయని వారిపై ఎలక్షన్ కమిషన్ ఆదేశానుసారం చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
జిల్లా గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు
జిల్లాలో పోలీస్, ఎఫ్ఎస్టీ సర్వెలెన్స్ టీమ్ ల ద్వారా తనిఖీలలో తగిన ఆధారం లేకుండా తీసుకువెళుతున్నా, స్వాధీనం చేసుకున్న రూ.50 వేలకు మించి నగదు, ఇతర వస్తువులుపై పరిశీలించి విడుదల చేసేందుకు జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీ పని చేస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కర్ణ న్ తెలిపారు. గురువారం ఎస్పీ అపూర్వ రావు, జిల్లా గ్రీవెన్స్ కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లా స్థాయి లో పోలీస్, సర్వెలేన్స్ బృందాలు స్వాధీనం చేసుకున్న నగదు,ఇతర వస్తువుల విడుదల చేసేందుకు వచ్చిన ఫిర్యాదులు, దరఖాస్తులను జడ్పీ సీఈఓ చైర్మన్ గా ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుందని చెప్పారు.
ALSO READ: దక్షిణ తెలంగాణపై ఎందుకీ వివక్ష
ఎక్కువ మొత్తంలో నగదు దొరికితే మొత్తం సీజ్ చేసి, డిపాజిట్ చేసి, ఎన్నికల కు సంబంధం లేదని సరైన ఆధారాలను చూపిస్తే తిరిగి ఇచ్చేస్తారని చెప్పారు. ఆధారాలు లేక సీజ్ అయిన నగదు విషయమై అప్పీలు, ఆధారాలు పొంది దరఖాస్తు చేసుకోవడానికి జిల్లా పరిషత్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన జిల్లా గ్రీవెన్స్ కమిటీ కన్వీనర్, జిల్లా సహకార అధికారి కాంటాక్ట్ నంబర్ 9100115650కు సంప్రదించాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి,
డీసీఓఆర్ కిరణ్ కుమార్, తదితరులు ఉన్నారు.