నల్గొండ అర్బన్, వెలుగు: స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నల్గొండ పట్టణంలోని ఎన్‌జీ కాలేజీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్‌ను పరిశీలించారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్‌తో పాటు ఈవీఎంల కమిషనింగ్‌కు ఏర్పాటు చేసిన గది, సీసీ కెమెరాలను పరిశీలించారు. రవాణా, పార్కింగ్ , భద్రతాపరమైన అంశాలపై అధికారులను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రవి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ముగిసిన ఏఎస్‌వోల జిల్లా పర్యటన
ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ఫౌండేషన్ కోర్స్ శిక్షణలో భాగంగా కేంద్ర సెక్రటేరియట్ సర్వీస్ - 2022 బ్యాచ్ సహాయ సెక్షన్ అధికారుల జిల్లా పర్యటన ముగిసింది. ఈ నెల 16 న జిల్లాకు వచ్చిన 25 మంది ఏఎస్‌వోలు 20 వరకు నల్గొండ మండలం అన్నెపర్తి, మిర్యాలగూడ మండలం శ్రీనివాస నగర్, దామరచర్ల మండలం వాడపల్లి, చిట్యాల మండలం ఉరుమడ్ల, మును గోడు మండలం పలివెల గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠ ధామాలతో పాటు ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించారు. అలాగే ప్రజల జీవన స్థితి గతులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేశారు. శుక్రవారం కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, అడిషనల్ కలెక్టర్ హేమంత్‌తో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. వీరి వెంట ప్రాంతీయ శిక్షణా కేంద్రం మేనేజర్ పి.వెంకటేశ్వర్లు ఉన్నారు.