రూ.33.66 కోట్లు పట్టుకున్నం : ఆర్‌‌వీ కర్ణన్

నల్గొండ అర్బన్, వెలుగు:  హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా డబ్బులు, మద్యం, ఇతర వస్తువులు పట్టుబడ్డాయని కలెక్టర్ ఆర్‌‌వీ కర్ణన్ తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో ఎన్నికల వ్యయ పరిశీలకులు, ఇతర కమిటీలు, లీడ్ బ్యాంక్ మేనేజర్, ఎక్సైజ్, ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు పోలీస్, ప్లయింగ్ స్క్వాడ్ ద్వారా  రూ.33 .63 లక్షల విలువైన నగదు, ఇతర వస్తువులు పట్టుకున్నామని వివరించారు. 210 కేసులు నమోదు కాగా.. 203 కేసులు  పరిష్కరించి రూ.33 .39 కోట్లు రిలీజ్ చేశామన్నారు. ఇంకా 7 కేసులు రూ.10 లక్షలకు పైబడి నగదు ఉన్నందున ఐటీ శాఖకు రెఫర్ చేశామని చెప్పారు.  

ఎక్సైజ్ శాఖ ద్వారా 1.23 లక్షల లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామని, వీటి  విలువ వాహనాలతో కలిపి మొత్తం రూ.2 .70 కోట్లు ఉంటుందన్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా మొత్తం 824 కేసులు నమోదు చేసి 268 మందిని అరెస్టు చేయడంతో పాటు 10 వాహనాలను సీజ్ చేశామన్నారు. సి విజిల్ యాప్ ద్వారా ఇప్పటివరకు 249 ఫిర్యాదులు రాగా  195 పరిష్కరించినట్లు వెల్లడించారు. ఎన్నికలకు సంబంధంలేని 54 కేసులను తిరస్కరించామని చెప్పారు. సమావేశంలో జిల్లా ఎస్పీ అపూర్వరావు, ఎక్స్‌పెండించర్‌‌ అబ్జర్వర్లు సంతోష్ కుమార్, సతీష్ గురుమూర్తి, డీఎం నిమ్జే, నోడల్ ఆఫీసర్లు, ఎక్స్‌పెండిచర్‌‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.