నల్గొండ అర్బన్, వెలుగు : ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారుల పాత్ర కీలకమని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆర్వోలు, ఏఆర్వోలు, సెక్టార్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదేశాలు ఇచ్చిన వెంటనే వాల్ రైటింగ్స్, ఫ్లెక్సీలు తొలగించడం అభినందనీమన్నారు. ఎన్నికలు ముగిసే వరకు ఇలాగే పనిచేయాలని సూచించారు. సెక్టార్ ఆఫీసర్లు రూట్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని, రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలన్నారు.
ఓటర్లు ఫిర్యాదుల కోసం సంప్రదించాల్సిన నెంబర్లను పోలింగ్ స్టేషన్లలో విధిగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ప్రొఫార్మాలను రెడీ చేయాలని ఆర్వోలకు సూచించారు. ఈవీఎంల రాండమైజేషన్ చేసి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు పంపిస్తామని , ఈ ప్రక్రియను ఆర్వోలు పర్యవేక్షించాలన్నారు. సమయానికి హాజరు కాని సెక్టార్ ఆఫీసర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఆర్వోలు శ్రీనివాస్, హేమంత కేశవ పాటిల్, రవి, చెన్నయ్య, శ్రీరాములు, దామోదర్, ఎంసీసీ నోడల్ ఆఫీసర్ హరి సింగ్ పాల్గొన్నారు.
పక్కాగా ఏర్పాట్లు చేయండి
హాలియా, కొండమల్లెపల్లి, చింతపల్లి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అనుముల ప్రభుత్వ ఐటీఐ భవనంలో ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ , నిడమనూరు తహసీల్దార్ కార్యాలయంలోని ఆర్‌వో ఆఫీస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అబ్జర్వర్లు, అకౌంటింగ్ టీమ్, వీవీటీ, సీ విజిల్, ర్యాలీ లు, మీటింగ్‌లు, వాహనాల అనుమతుల సెల్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.
ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌తో పాటు అదనపు ఈవీఎంలు భద్రపరిచేందుకు సరైన హాల్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అధికారులు, సిబ్బందికి భోజన వసతితో పాటు కౌంటర్లు, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం కొండమల్లెపల్లి, చింతపల్లి పరిధిలోని మాల్ గొడుకోండ్ల గ్రామం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును తనిఖీ చేశారు.
స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించాలి
యాదాద్రి, వెలుగు : ఎన్నికల్లో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించాలని కలెక్టర్ జెండగే హనుమంతు కొండిబా సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సెక్టార్ అధికారులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎలక్షన్ రూల్స్ ను కచ్చితంగా అమలు చేసేందుకు గ్రౌండ్ లెవల్ లో చర్యలు తీసుకోవాలన్నారు. సెక్టార్ అధికారుల విధి విధానాల హ్యాండ్ బుక్స్ లోని నియమాలు, మార్గదర్శకాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలున్న ప్రాంతాలను రెగ్యులర్ గా సందర్శించడం, బెదిరింపులకు పాల్పడే వ్యక్తులపై నిఘా పెట్టడం, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి బూత్ లెవల్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు.
బూత్ లెవల్ అధికారులతో సమన్వయం చేసుకుని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, ర్యాంప్, డ్రింకింగ్ వాటర్, కరెంట్, ఫర్మిచర్, టాయిలెట్స్ లాంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్ రావు, ఆర్డీవో అమరేందర్, కలెక్టరేట్ పరిపాలన ఆఫీసర్ జగన్, జిల్లా ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నాగేశ్వరాచారి తదితరులు ఉన్నారు.