ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలి : ఎస్.వెంకట్​రావు

సూర్యాపేట, వెలుగు : పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్​రావు కోరారు. గురువారం కలెక్టరేట్​లో లోక్ సభ ఎన్నికల నిర్వహణపై ఎస్పీ రాహూల్ హెగ్డే, అడిషనల్ కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, వివిధ రాజకీయ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ బీఎల్వోలు ఓటర్ స్లిప్పులను ఈనెల 28 వరకు  ప్రతి ఇంటికి పంపిణీ చేస్తారని తెలిపారు. 85 ఏండ్లు  దాటిన వయోవృద్ధులకు ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించడానికి అవకాశం ఉందన్నారు.

 హోం ఓటింగ్ కోసం 6070 మందికి 12–డి ఫాంలు  ఇచ్చామని, వీరిలో 354 మంది అప్లై చేసుకున్నారని వివరించారు. హోమ్ ఓటింగ్ అప్లై​చేసుకున్న వారి వివరాలను  ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులకు తెలపాలని సూచించారు. నాలుగు నియోజకవర్గాల్లో ఈవీఎం స్టాంగ్ రూమ్స్ లను రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించవచ్చని చెప్పారు. ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల్లో లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.

 జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ 100 శాతం జరిగేందుకు కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈవీఎం స్ట్రాంగ్ రూముల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, ఎన్నికల సూపరింటెండెంట్​శ్రీనివాసరాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. 

ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దు.. 

ఓటర్లు ఎలాంటి ప్రలభాలకు లొంగకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకట్​రావు సూచించారు.  ఓటు ఆవశ్యకతపై నిర్వహించిన జిల్లా స్థాయి డ్రాయింగ్, పెయింటింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ హెగ్డే, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ సీహెచ్ ప్రియాంకతో కలిసి కలెక్టర్ పాల్గొని విజేతలకు​బహుమతులు అందజేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్​ఎన్నికల్లో 95 శాతం ఓటర్ టర్న్ అవుట్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి అశోక్, డీఐఈవో కృష్ణయ్య, విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు 
పాల్గొన్నారు.