తుంగతుర్తి, వెలుగు: లోక్సభ ఎన్నికల్లో సెక్టోరల్ అధికార పాత్ర కీలకమని, అధికారులు అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్ రావు సూచించారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలో వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో లోక్ సభ ఎన్నికల నిర్వహణపై ఎస్పీ రాహుల్ హెగ్డే, సెక్టోరియల్ అధికారులు, పోలీసులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు వారికి కేటాయించిన సెక్టార్ పరిధిలోనే ఉండాలన్నారు. పోలీంగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు, టాయిలెట్స్, ఫ్యాన్లు, తాగునీరు సదుపాయం కల్పించాలని చెప్పారు. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల నియమాలను తప్పకుండా పాటించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, తహసీల్దార్రమణారెడ్డి, సెక్టోరిల్ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఓటు ఆవశ్యకతపై డ్రాయింగ్ పోటీలు..
సూర్యాపేట: ఓటు అవశ్యకతపై విద్యార్థులకు డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలు నిర్వహించి చైతన్యం చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. మంగళవారం సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘ఎన్నికల్లో మద్యం, డబ్బు దుర్వినియోగం, ప్రతిఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి’ అనే అంశాలపై విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు.
మూడు కేటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో 108 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతిఒక్కరూ స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి, నోడల్ అధికారి అశోక్, డీఐఈవో కృష్ణయ్య, ఇన్చార్జి క్వాలిటీ కో–ఆర్డినేటర్ జనార్దన్, బాల భవన్ పర్యవేక్షకుడు రాధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మట్టిని అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు..
చెరువుల్లోని మట్టిని అక్రమంగా తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ ఎస్.వెంకట్రావు హెచ్చరించారు. గ్రామాల్లోని చెరువుల నుంచి మట్టిని అక్రమంగా తరలించడంపై గ్రామస్తులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అక్రమ మట్టి తరలింపును అడ్డుకోవాలని రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.