మహిళా అభివృద్ధితోనే దేశం పురోగతి : ఎస్. వెంకటరావు

సూర్యాపేట, వెలుగు : మహిళా అభివృద్ధితోనే దేశం పురోగతి సాధిస్తుందని కలెక్టర్ ఎస్.వెంకటరావు అన్నారు. గురువారం కలెక్టరేట్​లో మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి అడిషనల్ కలెక్టర్ బీఎస్ లతతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో మహిళలు ముందుండంతోపాటు ఓర్పు, సహనంతో కుటుంబాలను తీర్చిదిద్దుతారని తెలిపారు. 

ఈ జిల్లాలో అదనపు కలెక్టర్లు ఇద్దరూ మహిళలు కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. వారి సహకారంతో జిల్లాను అభివృద్ధిలో ముందుంజలో ఉంచుతానన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాన్నాని తెలిపారు. పీఎం‌ఎఫ్‌ఎం‌ఈలో  జిల్లాను మొదటి ర్యాంక్ లో ఉంచిన్నందుకు మహిళలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పనిచేసే ప్రదేశాల్లో మహిళలను ఎవరైనా వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

అనంతరం అదనపు కలెక్టర్ బీఎస్ లత, డీడబ్ల్యూవో వెంకటరమణ, జడ్పీ డీప్యూటీ సీఈవో శిరీష, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ లత, సూర్యాపేట మున్సిపల్ చైర్​పర్సన్​ అన్నపూర్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రభుత్వ ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. 15 మంది వికలాంగులకు  స్కూటీలు, 6 త్రీ వీలర్ చైర్లను అందజేశారు. మహిళా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు, వ్యాసరచన, పాటల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో  ఎం‌పీపీలు కుమారి, పార్వతి, మల్లెల రాణి, అనిత, జడ్పీటీసీ మందాలపు కృష్ణ కుమారి, మున్సిపల్ కౌన్సిలర్లు, మహిళా ఉద్యోగులు, అంగన్​వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. 

మహిళా దినోత్సవం సందర్భంగా ర్యాలీ

దేవరకొండ, వెలుగు :  అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవరకొండ మండలం కమలాపూర్​ అంగన్​వాడీ కేంద్రంలో ఐసీడీఎస్​ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్​వైజర్​ చిట్టెమ్మ మాట్లాడుతూ మహిళలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్​ జయలక్ష్మి, గర్భిణులు పాల్గొన్నారు.