వనపర్తి, వెలుగు: అమ్మ ఆదర్శ పాఠశాల పనులను ఈ నెల 15లోగా కంప్లీట్ చేయాలని ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై డీఈవో, ఇంజనీరింగ్ ఆఫీసర్లతో రివ్యూ చేశారు. మండలం వారీగా చేపట్టిన పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
డబ్బులు రాలేదని నిర్లక్ష్యం చేయవద్దని, పనులు పూర్తయిన వెంటనే పేమెంట్ చేస్తామన్నారు. 329 పాఠశాలలను ఎంపిక చేయగా, 270 స్కూళ్లలో పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. డీఈవో గోవిందరాజు, పీఆర్ ఈఈ మల్లయ్య, ఆర్అండ్ బీ ఈఈ దేశ్యానాయక్ పాల్గొన్నారు.
జడ్పీ స్పెషల్ ఆఫీసర్గా గంగ్వార్
జిల్లా పరిషత్ పాలకవర్గం గడువు గురువారం ముగియడంతో శుక్రవారం ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జడ్పీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలను స్వీకరించారు. జడ్పీ చైర్మన్ ఛాంబర్ లో సీఈవో యాదయ్య సంతకాలు చేయించి బాధ్యతలు అప్పగించారు. 2023–24 బడ్జెట్ కేటాయింపులు, ఖర్చు, మిగిలిన బడ్జెట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో సమావేశం నిర్వహించి అభివృద్ధి పనులపై రివ్యూ చేస్తానని తెలిపారు.
విష జ్వరాలు రాకుండా చర్యలు తీసుకోవాలి
పెబ్బేరు, వెలుగు : మలేరియా, డెంగీ, టైఫాయిడ్ తో పాటు విష జ్వరాలు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ సూచించారు. డ్రై డే సందర్భంగా పెబ్బేరు టౌన్, మండలంలోని గుమ్మడం, యాపర్ల గ్రామాల్లో పర్యటించి డ్రై డేను పరిశీలించారు. 8వ వార్డులో శానిటేషన్ పనులను పరిశీలించి, డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. ప్రత్యేకాధికారులు వారానికి రెండు సార్లు పర్యటించి పారిశుధ్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
అనంతరం గుమ్మడం, యాపర్ల గ్రామాల్లో పరిసరాలను పరిశీలించారు. జీపీకి సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. మండలంలోని గుమ్మడం, యాపర్ల జడ్పీ హైస్కూల్, ప్రైమరీ స్కూళ్లలో చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. అనంతరం వనపర్తి జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకులాన్ని, జూనియర్ కాలేజీని సందర్శించారు. మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వైస్ చైర్మన్ కర్రెస్వామి, జడ్పీ సీఈవో యాదయ్య, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ సురేశ్, ఆర్డీవో పద్మావతి, అడిషనల్ డీఆర్డివో నాగేంద్రం, డీఎల్పీవో రఘునాథ్, వనపర్తి, పెబ్బేరు మున్సిపల్ కమిషనర్లు పూర్ణచందర్, ఆదిశేషు ఉన్నారు.