రాజన్న సిరిసిల్ల, వెలుగు: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా పూర్తిచేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఎన్యుమరేటర్లకు సూచించారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 17వ, 28వ వార్డుల్లో కొనసాగుతున్న సర్వేను ఆయన తనిఖీ చేశారు. సర్వేలో భాగంగా తీసుకుంటున్న సమాచారం ఇవ్వడానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని పలు ఇండ్ల యజమానులను ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ, ప్రజలకు ఇబ్బంది లేకుండా వివరాలు సేకరించాలన్నారు. సర్వేపై ప్రజలకు ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేయాలన్నారు. ఆయనతోపాటు ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ లావణ్య ఉన్నారు.
వడ్ల కొనుగోళ్లపై కలెక్టర్ రివ్యూ
కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్‌తో కలిసి ధాన్యం కొనుగోళ్లపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 1488 మంది రైతుల నుంచి రూ.107.86 కోట్ల విలువ చేసే 46,490 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు.
కొనుగోలు సెంటర్లకు వచ్చే సన్న రకం ధాన్యాన్ని వ్యవసాయ అధికారులు సర్టిఫై చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శేషాద్రి, డీసీఎస్‌వో వసంత లక్ష్మి, సివిల్ సప్లై డీఎం రజిత, డీసీవో రామకృష్ణ , డీఏంసీ(మెప్మా) రాజేశం, డీసీఎంఎస్ సెంటర్ ఇన్‌చార్జి శ్రీనివాస్ పాల్గొన్నారు.