
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల, వెలుగు: ఫిబ్రవరి 22 నుంచి జిల్లాలో కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సోమవారం కందుల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 1,129 ఎకరాల్లో కందులు సాగయ్యాయని, మొత్తం 6,211 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు.
ఐకేపీ కేంద్రాల ద్వారా గంభీరావుపేట, ఇల్లంతకుంట, ముస్తాబాద్, తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, చందుర్తి మండలాల్లో, మిగిలిన చోట్ల ప్యాక్స్ కేంద్రాల ద్వారా కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. తేమ శాతం12 లోపున్న కందులకు రూ.7,550 మద్దతు ధర చెల్లించనున్నట్లు చెప్పారు. సమావేశంలో జిల్లా మార్క్‌ఫెడ్ అధికారి హాబీబ్, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాశ్, డీఏవో అఫ్జలిబేగం, డీఆర్‌డీవో శేషాద్రి, డీసీవో రామకృష్ణ పాల్గొన్నారు.
అర్జీలను వెంటనే పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చిన అర్జీలకు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆయన ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో 116 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఎస్పీ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రజాదివస్‌లో 18 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. చందుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్ ముందు రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన కోన శ్రీనివాస్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.