
రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల పట్టణం నిత్యం పరిశుభ్రంగా ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు, పాత బస్టాండ్, సంజీవయ్య నగర్, పద్మ నగర్, వెంకంపేట, కార్గిల్ లేక్, కొత్త బస్టాండ్, రైతు బజార్, బైపాస్ రహదారులు, బతుకమ్మ ఘాట్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. మెయిన్ రోడ్డుపై డివైడర్‌కు రిపేర్లు చేయించాలని, మధ్యలో మొక్కల పెంచాలని సూచించారు.స్పెషల్ డ్రైవ్ చేపట్టి అన్ని రోడ్లు నిత్యం శుభ్రం చేయించాలన్నారు. విద్యుత్, నీటి సరఫరా పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఏఈ స్వామి, సిబ్బంది తదితరులు ఉన్నారు.
నాపై అసత్య ప్రచారాలు చేస్తే కేసులు తప్పవు
తన వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చేలా అసత్య ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హెచ్చరించారు. తనపై కేసులున్నాయని సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్యప్రచారంపై బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అసత్య ఆరోపణలు, కట్టుకథల అధారంగా మీడియా, సోషల్ మీడియాలో వార్తలను ప్రసారం చేసి, అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవద్దని కలెక్టర్ సూచించారు.
ఉన్నత లక్ష్యంతో విద్యను అభ్యసించాలి
వేములవాడ, వెలుగు : విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో విద్యను అభ్యసించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. బుధవారం వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లి సోషల్ వెల్ఫేర్ గురుకులాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కిచెన్, స్టోర్ రూమ్, డార్మిటరీ, క్లాస్‌రూంలు, మెనూ చార్ట్ పరిశీలించారు. భోజనం తయారుచేస్తుండగా నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సిలబస్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.