వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయం, పట్టణ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ రాజన్న ఆలయంలోని చైర్మన్ చాంబర్ లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఆలయ అధికారులతో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అంతకుముందు రాజన్నను దర్శించుకొని స్వామివారికి మొక్కులు చెల్లించారు. రాజన్న ఆలయంలో భక్తులకు త్వరితగతిన దర్శనం, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నామన్నారు.
కోడె మొక్కులతో పాటు గోశాలను అధునాతన పద్ధతిలో తీర్చిదిద్దుతామన్నారు. మూలవాగులోకి మురుగు నీరు చేరకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు. మూలవాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని పూర్తి చేస్తామన్నారు. భక్తుల సౌకర్యార్థం దేవాలయ విస్తీర్ణం పెంచడంతో పాటు వసతి గదుల నిర్మాణం, తాగునీటి వసతి కల్పించాలన్నదే ప్రధాన ధ్యేయమన్నారు. రాబోయే రోజుల్లో భక్తులకు మెరుగైన దర్శనంతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనానికి ఏర్పాట్లు చేస్తామన్నారు.
పట్టణంలోని తిప్పపూర్ బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు వైడింగ్ పనులను త్వరలో చేపడుతామని, అందరూ సహకరించాలని కోరారు. అనంతరం మూలవాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. సమావేశంలో ఈవో రామకృష్ణ, ఆర్డీవో రాజేశ్వర్, ఆలయ ఈఈ రాజేశ్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహసీల్దార్ మహేశ్‌కుమార్ పాల్గొన్నారు.