రాజన్న సిరిసిల్ల,వెలుగు : పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన స్కూళ్లలో అభివృద్ధి పనులను నెలాఖరు నాటికి పూర్తి చేయాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో పీఎం శ్రీ స్కూళ్లలో అభివృద్ధి పనులపై కలెక్టర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైసింగ్ ఇండియా కింద మొత్తం 16 స్కూళ్లు ఎంపికయ్యాయని, వాటిల్లో అభివృద్ధి పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు.
మౌలిక వసతులు, ఫర్నీచర్, ఇంటర్‌నెట్ కనెక్షన్, టచ్ స్క్రీన్ల ఏర్పాటు, శుద్ధమైన తాగునీరు, కంప్యూటర్లు, సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటు.. తదితర పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రానున్న టెన్త్ ఎగ్జామ్స్‌లో జిల్లా మెరుగైన ఫలితాలు సాధించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.
సమావేశంలో విద్యాశాఖ అధికారులు, 16 స్కూళ్ల హెచ్‌ఎంలు పాల్గొన్నారు. అంతకుముందు సిరిసిల్ల పట్టణానికి చెందిన గాజుల శ్రీనివాస్ అనే దివ్యాంగుడు అనారోగ్య కారణాలతో ఇటీవల చనిపోగా.. అతని భార్యకు ఉపాధి కోసం జూకి కుట్టు మిషన్ కలెక్టర్ అందజేశారు.