
రాజన్న సిరిసిల్ల, వెలుగు : జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్‌లో వేగం పెంచాలని రాజన్నసిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై సంబంధిత ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పైలెట్ గ్రామాల్లో మంజూరు చేసిన 1,023 ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్‌కు చర్యలు తీసుకోవాలన్నారు. బేస్‌మెంట్ లెవెల్ పూర్తయిన ఇండ్లకు వెంటనే పేమెంట్ చేస్తామన్నారు.
ఇల్లంతకుంట మండలంలోని ఓబులాపూర్, ముస్తాబాద్ మండలం గూడెం, కొండాపూర్, తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల, గంభీరావుపేట, సిరిసిల్ల అర్బన్ గ్రామాల్లో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం https://rajannasircilla.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో ఏప్రిల్ 13 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అంతకుముందు ధరణి పెండింగ్ దరఖాస్తులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో రివ్యూ చేశారు. జిల్లాలోని 13 మండలాల్లో 408 ధరణి దరఖాస్తులు ఆయా అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వారంలోపు పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీవోలు రాధాభాయి, రాజేశ్వర్, అన్ని మండలాల తహసీల్దార్లు, హౌసింగ్ పీడీ శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు