రాజన్నసిరిసిల్ల/వీర్నపల్లి, వెలుగు: భారీగా కురుస్తున్న వానలతో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. రెండు రోజులుగా కురుస్తున్న వానలకు రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలోని ఎగువ మానేరు మత్తడి దుంకుతుండగా మంగళవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సందర్శకులను అనుమతించొద్దని అధికారులను ఆదేశించారు.
అలాగే వీర్నపల్లి మండలం గర్జనపల్లి, వన్‌పల్లి వద్ద లోలెవెల్ బ్రిడ్జిలు, గర్జనపల్లిలో ఇల్లు కూలిపోగా పరిశీలించారు. ఇల్లంతకుంట మండలం జవారిపేట– నర్సక్కపేట గ్రామాల మధ్యగల బిక్కవాగు, కందికట్కూరు గ్రామంలో లోలెవల్ వంతెన, జవారిపేట జీపీ సమీపంలో నిలిచిన నీటిని, జవారిపేట–రోడ్డును పరిశీలించారు. వారి వెంట సిరిసిల్ల ఆర్డీవో రమేశ్, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఇరిగేషన్ అధికారి అమరేందర్ రెడ్డి, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.