గద్వాల, వెలుగు: రైతులు క్వాలిటీ సీడ్ నే కొనుగోలు చేయాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. శనివారం గద్వాల మండలం చెంగంపల్లి విలేజ్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సీడ్ కొనుగోలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుర్తింపు పొందిన డీలర్ వద్దనే సీడ్ కొనుగోలు చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో లూస్ విత్తనాలు కొనుగోలు చేయవద్దన్నారు.
విత్తనాలకు సంబంధించిన బిల్లులు, ఖాళీ ప్యాకెట్లు తప్పనిసరిగా భద్రపర్చుకోవాలన్నారు. దీంతో దిగుబడి రాకపోయినా, ఇబ్బందులు వచ్చినా కంపెనీ వారిపై చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుందని చెప్పారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. డీఏవో గోవింద్‌నాయక్, ఏడీ సంగీతలక్ష్మి, ఏవో ప్రతాప్ కుమార్ ఉన్నారు.
కోడేరు: నకిలీ పురుగు మందులు, విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కొల్లాపూర్ సీఐ మహేశ్, ఏవో శ్రీరాం, ఎస్ఐ కురుమూర్తి, పెద్దకొత్తపల్లి ఎస్ఐ సతీశ్ హెచ్చరించారు. పెద్దకొత్తపల్లి, కోడేరు మండల కేంద్రాలతో పాటు ముత్తిరెడ్డిపల్లిలో ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. ఏఈవోలు పృథ్వీరాజ్, మధుసూదన్ రెడ్డి,నవ్య భారతి పాల్గొన్నారు.
లింగాల: ఫర్టిలైజర్ షాపుల్లో నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ జగన్మోహన్ హెచ్చరించారు. ఏవో నాగార్జున రెడ్డితో కలిసి ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేశారు. గ్రామాల్లో నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు.
వంగూర్: నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు మాత్రమే రైతులకు అమ్మాలని ఏవో తనుజ రాజు, ఎస్ఐ మహేందర్ సూచించారు. ఆగ్రో ఫర్టిలైజర్ షాపును తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. నాసిరకమైన విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.