అలంపూర్ ను పర్యాటక కేంద్రం చేస్తాం : కలెక్టర్ సంతోష్

 అలంపూర్ ను పర్యాటక కేంద్రం చేస్తాం : కలెక్టర్ సంతోష్

అలంపూర్, వెలుగు: అలంపూర్​ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ సంతోష్ తెలిపారు. ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం అలంపూర్ జోగులాంబ ఆలయ అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. దేవస్థానానికి సంబంధించిన సూచిక బోర్డులను ఇటిక్యాల క్రాస్ రోడ్, మనోపాడ్, అలంపూర్ క్రాస్ రోడ్, అలంపూర్ ఫ్లైఓవర్ వద్ద పరిశీలించారు.

వాటిని మరింత ఆకర్షణీయంగా ఏర్పాటు చేయాలన్నారు. ఆలయ చరిత్రను ప్రతిబింబించేలా పెద్ద అక్షరాలతో సమాచార బోర్డులు పెట్టాలని సూచించారు. ఫ్లైఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై ఆలయ సంస్కృతికి సంబంధించిన పెయింటింగ్ పనులు చేపట్టాలన్నారు. భక్తులకు పార్కింగ్, ఇతర సదుపాయాలు కల్పించేందుకు 20 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూమిని పరిశీలించారు.

పాపనాశి ఆలయాన్ని సందర్శించి, పూజలు చేశారు. సంగమేశ్వర ఆలయంలో పారిశుధ్యానికి చర్యలు తీసుకోవాలన్నారు. అడిషనల్​కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్, దేవదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, ఆర్కిటెక్ట్​లు సూర్యనారాయణ మూర్తి, శ్రీలేఖ, కేంద్ర పురావస్తు శాఖ అధికారి రోహిణి పాండే, ఏడీ ఆర్కియాలజీ నాగలక్ష్మి, ఈవో పురేందర్, డీపీవో నాగేంద్రం, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.