ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి : కలెక్టర్ సంతోష్​

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి : కలెక్టర్ సంతోష్​
  • కలెక్టర్ సంతోష్​

అలంపూర్, వెలుగు : వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. మంగళవారం అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని అన్ని వార్డులు, ఎక్స్​రే, ఈసీజీ డయాలసిస్​యూనిట్లను పరిశీలించారు. కలెక్టర్​ మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఔట్, ఇన్ పేషెంట్ల వివరాలను ఆన్ లైన్ లో సక్రమంగా నమోదు చేయాలన్నారు. 

ఫార్మసీలో అన్ని మందులు ఉండేలా ఉంచుకోవాలని చెప్పారు. ప్రతి మందుపై స్పష్టమైన పేర్లతో లేబుల్స్ ఉండాలని సూచించారు. ఆస్పత్రి పరిసరాలు  పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. ఆస్పత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోగులకు టెస్టులు త్వరగా పూర్తి చేసి రిపోర్టులు సమయానికి అందించాలన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ సరస్వతి, డాక్టర్లు లక్ష్మమ్మ, ఫణీంద్ర, వైద్య సిబ్బంది ఉన్నారు.