సంగారెడ్డి టౌన్ ,వెలుగు: ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ పిలుపునిచ్చారు. మంగళవారం స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ఉద్యోగులు, అధికారులు, కళాకారులు, వివిధ వర్గాల ప్రజలతో కలిసి ఓటరు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన అర్హులందరినీ ఓటరుగా నమోదు చేశామన్నారు.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే అవకాశం ఒక్క ఓటుకు మాత్రమే ఉందన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు వేయాలని సూచించారు. ఎస్పీ రూపేశ్ మాట్లాడుతూ.. ఓటు వజ్రాయుధం లాంటిదని, బుల్లెట్ కన్నా బ్యాలెట్ ఎంతో గొప్పదన్నారు. విద్యార్థులు, యువత ఓటు వేయడంతో పాటు ఇంట్లో అందరూ ఓటు వేసేలా చైతన్య పర్చాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, అడిషనల్ ఎస్పీ అశోక్, అధికారులు డీఆర్‌ఓ నగేశ్, వివిధ వర్గాల ప్రజలు, కళాకారులు పాల్గొన్నారు.
ALSO READ : తలకొండపల్లి మండలంలో రూ.19.38 లక్షల విలువ చేసే మద్యం స్వాధీనం : నర్సింహారెడ్డి
మెదక్ టౌన్: ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం పోలింలే లక్ష్యంగా స్వీప్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పట్టణంలో వాక్ ఫర్ ఓట్అనే స్లోగన్‌తో స్థానిక రాందాస్ చౌరస్తా నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. అనంతరం యువ ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్, డీఈవో రాధాకిషన్, డీఐఈవో సత్యనారాయణ, ఆర్వో రాజేశ్వర్, స్వీప్ నోడల్ అధికారి, డీడబ్ల్యువో బ్రహ్మాజీ, డీఎస్వో రాజిరెడ్డి, డీవైఎస్వో నాగరాజు, ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, కళాజాత బృందాలు పాల్గొన్నారు.