గృహలక్ష్మి దరఖాస్తులను సరిగా పరిశీలించాలి: డాక్టర్ శరత్

గృహలక్ష్మి దరఖాస్తులను సరిగా పరిశీలించాలి:  డాక్టర్ శరత్

సంగారెడ్డి టౌన్, వెలుగు : గృహలక్ష్మి పథకం కోసం వచ్చిన దరఖాస్తులను ఆయా టీమ్స్  క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో పలు అంశాలపై సమీక్షించారు. గృహలక్ష్మి పథకానికి అర్హుల దరఖాస్తులను సంబంధిత యాప్ లో అప్​లోడ్ చేయాలని కలెక్టర్​ సూచించారు. రెండో విడత దళిత బంధుకు అర్హుల జాబితాను అప్​లోడ్ చేయాలన్నారు. బీసీ కులవృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేసేందుకు రెండో విడతలో నియోజకవర్గానికి 300 మంది లబ్ధిదారుల చొప్పున అర్హుల జాబితాలను సిద్ధం చేయాలని సూచించారు. 19న మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం పంపిణీకి రెడీ చేయాలన్నారు.

రెండో విడతలో జిల్లా లక్ష్యం మేరకు గొర్రెల పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల ముగింపులో భాగంగా జిల్లాలో  6.20 లక్షల మొక్కలు నాటడానికి స్థలాలను గుర్తించి  ఏర్పాట్లు చేయాలని చెప్పారు.  కారుణ్య నియామకాలను వేగవంతం చేయాలన్నారు. జీవో 58, 59 వెరిఫికేషన్ పూర్తి కావాలని చెప్పారు. ఆయిల్ పామ్ సాగుకు జిల్లా టార్గెట్ మేరకు ఐదువేల ఎకరాలను త్వరగా గుర్తించాలన్నారు. గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా అన్ని మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో అన్ని వర్గాల ప్రజలకు ఓటర్ నమోదు, ఓటు హక్కు వినియోగించు కోవడం పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్ఓ నగేశ్, ఆయా శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.