
కొండాపూర్,వెలుగు: ఎన్నికల్లో వంద శాతం ఓటింగే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ సూచించారు. బుధవారం ‘నేను నా ఓటు పక్కా వినియోగించుకుంటాను‘ అనే అవేర్ నెస్ ప్రోగ్రాంను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ఓటు వినియోగంపై సంగారెడ్డి లో వివిధ పద్ధతుల ద్వారా అవగాహన కల్పించారు. ప్రోగ్రాంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, మాధవి, డీఆర్వో నగేశ్, ఆఫీసర్లు పాల్గొన్నారు.
ఉద్యోగులు బాధ్యతతో పని చేయాలె
ఉద్యోగులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ శరత్ సూచించారు. టీఎన్జీవోస్ కొత్త కమిటీ సభ్యులు కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ మాధురి, ఎస్పీ రూపేశ్ లను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. కార్యక్రమంలో జావేద్ అలీ, రవి, శ్రీకాంత్, శ్రీనివాస్, ఖాజాగౌస్ పాల్గొన్నారు.
కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేయాలి
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సి విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లను, సెల్ నెంబర్, తదితర వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఫిర్యాదులను అధికారులు వెంటనే పరిశీలించి, వంద నిమిషాల్లోగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 94 కేసులలో రూ. 2,57,93,790 క్యాష్సీజ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సరియైన ఆధారాలు చూపించడంతో రూ.1,93,20,610. నగదు విడుదల చేశామన్నారు. సరైన ఆధారాలను జిల్లా గ్రీవెన్స్ కమిటీలో చూపెట్టి డబ్బును విడుదల చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.