పత్తి రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి

పత్తి రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి

కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​కు వచ్చే పత్తి రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్ సత్య శారదా దేవి అన్నారు. శనివారం కలెక్టరేట్​లో శుక్రవారం ఏనుమాముల మార్కెట్లో జరిగిన సంఘటనపై కలెక్టర్ మార్కెట్ కమిటీ ఆఫీసర్లతోపాటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్ కు వచ్చే పత్తి రైతులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 పత్తి రైతుల ఆందోళనపై మార్కెట్ కమిటీ ఆఫీసర్లతోపాటు వ్యాపారస్తులతో చర్చించనున్నట్లుగా తెలిపారు. అనంతరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిండెంట్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల వర్షాలతో పత్తిలో తేమ పెరిగిందని, సీసీఐ 12 శాతం తేమ నియమాలను సడలించాలని కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. కానీ, కొంతమంది స్వార్థపరులు రైతులలో అపోహలు సృష్టించి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. స్పందించిన కలెక్టర్​రెచ్చగొట్టే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ ఆఫీసర్లు డీడీఎం, డీఎంవో, సెక్రెటరీ నిర్మల, వ్యాపారస్తులు తదితరులున్నారు.