
సంగారెడ్డి టౌన్, వెలుగు : ఆఫీసర్లు వారికి కేటాయించిన ఎన్నికల డ్యూటీలను సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో ఎస్పీ రూపేశ్తో కలిసి అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులందరూ ఎన్నికల నిబంధన మేరకు పనిచేయాలని ఆదేశించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం తప్పులు జరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని బృందాలు వారికి కేటాయించిన విధులపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలన్నారు.
ఓటర్ అవేర్నెస్ ఫోరంలను ఏర్పాటు చేయాలని, ఓటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లా ఎస్పీ రూపేశ్ మాట్లాడుతూ.. ఎన్నికలు పూర్తయ్యే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా చూడాలని కోరారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, అడిషనల్ ఎస్పీ అశోక్ , పాల్గొన్నారు.