- ఆఫీసర్లకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచన
- ఫిబ్రవరి 10లోగా పనులు పూర్తి కావాలని డెడ్ లైన్
- బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా చూడాలి : వరంగల్ సీపీ
హనుమకొండ, వెలుగు : మేడారం జాతర నేపథ్యంలో హనుమకొండ జిల్లా పరిధిలోని రోడ్ల రిపేర్లు, సైన్ బోర్డులు, భద్రతా పరమైన పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆఫీసర్లను ఆదేశించారు. గుర్తించిన పనులన్నింటినీ ఫిబ్రవరి 10లోగా పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టారు. హనుమకొండ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం ఆర్ అండ్ బీ, పోలీస్, కుడా, జీడబ్ల్యూఎంసీ, నేషనల్ హైవేస్, ఆర్టీవో తో డిస్ట్రిక్ట్ రోడ్డు సేఫ్టీ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ..
ఫిబ్రవరి 21 నుంచి 24వరకు మేడారం మహాజాతర జరగనున్న నేపథ్యంలో జిల్లా అధికారులంతా కోఆర్డినేషన్ తో పని చేయాలన్నారు. నగరంతోపాటు జిల్లాకు సంబంధించిన అన్ని రహదారులు బాగుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కల్వర్టులు, ఇరుకైన వంతెనల వద్ద ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పారు. జిల్లా పరిధిలోని కటాక్షపూర్ వరకు రోడ్డు రిపేర్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వరంగల్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ మేడారం వెళ్లే భక్తులు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలన్నారు.
అవసరమైన చోట్లా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నియంత్రణకు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన చోట బారికేడ్లను సిద్ధం చేయాలన్నారు. ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు.
ట్రాఫిక్ సమస్యలు రావొద్దు..
హనుమకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్, వరంగల్ బస్టాండ్ నుంచి మేడారం బస్సులు ఎక్కువగా నడుస్తాయని, నగరంలో ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ ఆఫీసర్లు పర్యవేక్షించాలని గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా సూచించారు. వరంగల్ రింగ్ రోడ్డుపై కరుణాపురం వద్ద హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు బైపాస్ తెలియకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, అక్కడ ప్రత్యామ్నాయ ప్రతిపాదనను సిద్ధం చేయాలన్నారు.
కరుణాపురం వద్ద రోడ్డును ఇటీవల రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారని, ఈ మేరకు అక్కడి లోపాలపై ఆర్ అండ్ బీ, కుడా, ట్రాఫిక్ పోలీసులు సమగ్రంగా అధ్యయనం చేయాలన్నారు. కరుణాపురం నుంచి కాజీపేట వైపున్న రోడ్డులో ఎల్లో స్ట్రిప్స్ పెట్టాలని ఆర్ అండ్ బీ ఆఫీసర్లకు సూచించారు.
అగ్రంపహాడ్ జాతరకూ ఏర్పాటు చేయాలి
వరంగల్ శివారులోని దామెర నుంచి కటాక్షపూర్ వరకు రోడ్డు రిపేర్ పనులు పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ అన్నారు. జిల్లాలో అగ్రంపహాడ్ మినీ మేడారం జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, వరంగల్ కాశీబుగ్గ నుంచి మొగిలిచర్ల, అక్కంపేట మీదుగా అగ్రంపహాడ్ వరకు రోడ్ల రిపేర్లు చేయాలన్నారు. ఈ మార్గంలో ఇరువైపులా దారి కనిపించేలా ముళ్లపొదలు తొలగించాలన్నారు.
కొన్నిచోట్ల వ్యవసాయ బావులు రోడ్ల పక్కనే ఉన్నాయని, వాటి వద్ద తగిన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. హోల్డింగ్ పాయింట్ల వద్ద ఆర్ అండ్ బీ అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. మేడారం జాతరకు ఆది, బుధవారాల్లో వెళ్లే వారి సంఖ్య బాగా పెరుగుతోందని, ఎక్కడా ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.
పది రోజుల్లో రిపేర్లు
కటాక్షపూర్ వరకు రోడ్డు రిపేర్లు, వంతెనల వద్ద రోడ్డు సేఫ్టీ పనులను ఫిబ్రవరి 10లోగా పూర్తి చేస్తామని ఎన్ హెచ్ ఈఈ మనోహర్ వెల్లడించారు. వరంగల్ రింగ్ రోడ్డు పై ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి ఆరెపల్లి వరకు సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామని ఆర్ అండ్ బీ ఈఈ ఎల్.రాజం తెలిపారు. హంటర్ రోడ్డు మార్గంలో కూడా రోడ్ సేఫ్టీ పనులను చేపట్టి పది రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ఎర్రగట్టుగుట్ట నుంచి పరకాల వరకు ఉన్న రోడ్డుకు సంబంధించిన పనులు, ముళ్ల కంపలను ఫిబ్రవరి 10లోగా తొలగిస్తామన్నారు. అదేవిధంగా హుజూరాబాద్ నుంచి పరకాల వరకు రోడ్డు రిపేర్లు చేసి
సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తామని రాజం వివరించారు. ఈ సమావేశంలో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ట్రైనీ ఐపీఎస్ శుభం నాగరాలే, ఏసీపీలు కిరణ్ కుమార్, కిషోర్ కుమార్, భోజరాజు, ఎంవీఐ కంచి వేణు, కుడా పీవో అజిత్ రెడ్డి, ఆర్ అండ్ బీ డీఈ సురేష్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.