
నారాయణపేట, వెలుగు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్ర మున్సిపాలిటీలో కమిషనర్ భోగిశ్వర్ అధ్యక్షతన ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి సమస్యలు లేని వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు.
2020లో దరఖాస్తు చేసుకున్న వారికి అప్పటి మార్కెట్ వాల్యూ ప్రకారమే ఫీజు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కమిషనర్ , టీపీఓ సమన్వయం చేసుకుని పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. సదస్సులో పలువురు రియల్ వ్యాపారులు సందేహాలను ప్రస్తావించారు. వారి సందేహాలకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కిరణ్ కుమార్ సమాధానాలు చెప్పారు. కలెక్టర్ మున్సిపాలిటీలో ని ఎల్‌ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ ను, కాల్ సెంటర్ ను పరిశీలించారు.