స్టూడెంట్లకు నాణ్యమైన భోజనం పెట్టాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

స్టూడెంట్లకు నాణ్యమైన భోజనం పెట్టాలి : కలెక్టర్  సిక్తా పట్నాయక్

నారాయణపేట, వెలుగు : స్కూళ్లు, హాస్టళ్లలో స్టూడెంట్లకు నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించాలని కలెక్టర్  సిక్తా పట్నాయక్  ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట కేజీబీవీ, బాలికల గురుకుల పాఠశాల, దామరగిద్ద బాయ్స్​ హాస్టల్​ను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ సప్లై చేస్తున్న బియ్యం పరిశీలించి, బాగా లేకపోతే తిరిగి పంపించాలన్నారు.  

గుడ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల నాణ్యతను ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాత  వినియోగించాలని సూచించారు. హాస్టళ్లలో మెస్  కమిటీ సభ్యులు, టీచర్లు, కేర్  టేకర్లు భోజనాన్ని ముందుగా రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని చెప్పారు. మాగనూర్  వంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. జీసీడీవో పద్మ నళిని, వసతి గృహాల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.

వనపర్తి : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని కలెక్టర్  ఆదర్శ్  సురభి ఆదేశించారు. పెద్దమందడి మండలం వెల్టూరు జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ స్కూల్, కొత్తకోట మండలం అమడబాకుల జూనియర్  కాలేజీ హాస్టల్ ను కలెక్టర్  తనిఖీ చేశారు. హాస్టళ్లలో ఆహార పదార్థాల నాణ్యత, గడువు తేదీ, స్టాక్  రిజిస్టర్​ను పరిశీలించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి 
తెలుసుకున్నారు.

నాణ్యమైన భోజనం అందిస్తాం

మాగనూర్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని అడిషనల్  కలెక్టర్  బెన్ శాలం, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. పురుగుల అన్నం పెట్టారనే ఆరోపణల నేపథ్యంలో మాగనూర్  హైస్కూల్ ను శుక్రవారం వారు సందర్శించారు. తహసీల్దార్, ఎంపీడీవో పర్యవేక్షణలో మధ్యాహ్న భోజనం వండించి, అడిషనల్​ కలెక్టర్, ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. 

ఏదైనా సమస్య వస్తే పరిష్కరించుకునే బాధ్యత మనపైనే ఉందని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో రాజకీయాలు చేయవద్దని, పార్టీలకు అతీతంగా పాఠశాల, విద్యార్థుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇన్​చార్జి హెచ్ఎంగా కళావతి, మధ్యాహ్న భోజనం ఇన్​చార్జిగా రాకేశ్ కు బాధ్యతలు అప్పగించినట్లు అడిషనల్  కలెక్టర్  తెలిపారు.