మక్తల్, వెలుగు: మక్తల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. నేడు మండలంలోని కాచ్ వార్ గ్రామంలో జరిగే ప్రజాపాలన గ్రామసభకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ మక్తల్ ఆస్పత్రిని పరిశీలించి డయాలసిస్ సెంటర్ కేంద్రంలో అవసరమైన పరికరాలు, బెడ్లు ఇతర వసతి సౌకర్యాల గురించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, ఆస్పత్రి సమన్వయకర్త డాక్టర్ మల్లికార్జున్ తో చర్చించి సూచనలు చేశారు. అనంతరం ఆస్పత్రిలోని ప్రసూతి వార్డును, లేబర్ రూమ్ ను పరిశీలించారు.
కలెక్టర్ మక్తల్ శివారులోని 150 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి ప్రతిపాదించిన 10 ఎకరాల స్థలాన్ని ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరితో కలిసి పరిశీలించారు. ఆ స్థలాన్ని బుధవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పరిశీలిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సతీశ్ కుమార్, మక్తల్ మున్సిపల్ కమిషనర్ భోగీశ్వర్, ఆర్. ఐ. రాములు, సర్వేయర్, తదితరులు పాల్గొన్నారు.