- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట, వెలుగు: ప్రధాన మంత్రి కిసాన్ యోజనను జిల్లా రైతులకు లబ్ధి చేకూరేలా చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆఫీసర్లకు సూచించారు. 2019 ఫిబ్రవరి 1 కంటే ముందే భూమి ఉన్నప్పటికీ పాస్‌బుక్ రాకపోవడం వల్ల జిల్లాలో చాలామంది రైతులకు పీఎం కిసాన్ డబ్బులు అందడం లేదన్నారు.
అలాంటి రైతులు ఇప్పుడు మీ -సేవా, లేదా సాధారణ సేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో అర్హులైన రైతులకు పీఎం కిసాన్ యోజన పథకాన్ని వర్తింపజేయాలన్నారు.
సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్ ఏమైనా అనుమానాలు ఉంటే మండల వ్యవసాయశాఖ
అధికారులు, ఏఈఓతో నివృత్తి చేసుకోవాలని తెలిపారు.
ఇప్పటికే పీఎం కిసాన్ యోజన పోర్టల్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని రైతులకు ఆ పథకాన్ని వర్తింప చేయడానికి ఏవోలు, ఏఈ వోలు మీ సేవా, సీ ఎస్ సీ కేంద్రాల నిర్వాహకులు కృషి చేయాలని ఆయన కోరారు.