నారాయణపేట, వెలుగు: ప్రతీ వ్యక్తి జీవితంలో సైన్స్ చాలా అవసరమని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాల లో జిల్లా విద్యా వైజ్ఞానిక ఉత్సవం రెండో రోజు శనివారం ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువ మొత్తంలో పాల్గొని ప్రదర్శనలు ఇవ్వడం అభినందనీయమన్నారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి యోగానంద్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మెర్సీ వసంత, జిల్లా సైన్సు అధికారులు భాను ప్రకాష్, కనకప్ప, యాదయ్య శెట్టి, ఏఎంఓ విద్యాసాగర్ పాల్గొన్నారు.
రోడ్డు భద్రత పాటించేలా చర్యలు తీసుకోవాలి
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఈనెల ఒకటి నుంచి 31 వరకు జరిగే రోడ్డు భద్రతా వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్, ఎస్పీ యోగేశ్ గౌతమ్ తో కలిసి ఆవిష్కరించారు.