శాంతినగర్, వెలుగు: తుమ్మిళ్ల లిఫ్ట్‌లో భాగంగా నిర్మించనున్న మల్లమ్మ కుంట రిజర్వాయర్ కోసం సేకరించనున్న భూములను కలెక్టర్ సంతోష్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరావు పరిశీలించారు. ముంపునకు గురవుతున్న భూమికి బదులుగా భూమి ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. స్పందించిన కలెక్టర్ రైతులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ, పట్టా భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ సర్వేను వేగవంతం చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు స్టార్ట్ చేయాలన్నారు. పంపింగ్ స్టేషన్ల కెపాసిటీ, రిజర్వాయర్ నీటిమట్టం, నీటి ప్రవాహం తదితర అంశాలపై ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. ఆర్డీఎస్ ఈఈ విజయ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ జోషి ఉన్నారు.
పెండింగ్ పనులు కంప్లీట్ చేయాలి
గద్వాల: జిల్లాలోని ఆర్అండ్ఆర్ సెంటర్లలో పెండింగ్ పనులను వెంటనే కంప్లీట్ చేయాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో ఆర్అండ్ఆర్ సెంటర్లపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నోనిపల్లి, నాగర్ దొడ్డి ఆర్అండ్ఆర్ సెంటర్లలో అన్ని సౌలతులు కల్పించాలని సూచించారు.
ఆలూరు ఆర్అండ్ఆర్ సెంటర్ భూమిని స్వాధీనం చేసుకొని కాంపౌండ్ వాల్ నిర్మించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరావు, నెట్టెంపాడు ఈఈ రహీముద్దీన్, ఆర్డీవో రాంచందర్, మిషన్ భగీరథ ఈఈ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.