- విద్య, వైద్యంపై ఫోకస్
- 15 మంది సస్పెన్షన్.. 40 మందికి నోటీసులు
- ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటన
- విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆఫీసర్లపై వేటు
సూర్యాపేట, వెలుగు: నిత్యం క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలనే ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్ గ్రౌండ్ లెవల్ లో పర్యటిస్తున్నారు. దీంతో ఒక్కొక్కటిగా ఉద్యోగుల బాగోతాలు బయటపడుతున్నాయి. మరోవైపు అధికారుల గుండెల్లోనూ దడ పుట్టిస్తున్నారు. విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో వారంలో 3 రోజులు స్కూల్స్, పీహెచ్ సీలను కలెక్టర్ సర్ ప్రైజ్ విజిట్ చేస్తున్నారు. అలసత్వం వహిస్తున్న ఉద్యోగులపై వెంటనే కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు.
అక్రమాలకు పాల్పడినట్టు తేలితే..
జిల్లావ్యాప్తంగా నెలరోజుల నుంచి కలెక్టర్పర్యటిస్తూ అలసత్వం వహించిన 15 మంది సిబ్బందిని సస్పెండ్ చేశారు. మరో 40 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, పర్మిషన్ లేకుండా డ్యూటీలకు డుమ్మా కొడుతున్న సిబ్బందిపై వేటు వేస్తున్నారు. ఇప్పటికే విద్యాశాఖలో ఆరుగురు, వైద్యారోగ్యశాఖలో నలుగురు, సివిల్ సప్లయ్ శాఖలో ఒకరు, రెవెన్యూ శాఖలో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. పంచాయతీ, రెవెన్యూ, విద్య, వైద్యారోగ్య శాఖల్లో అక్రమాలకు పాల్పడినట్టు తేలిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ధరణిలో ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో జిల్లా వ్యాప్తంగా 23 మందిని బదిలీ చేశారు.
పర్యవేక్షణకు స్పెషల్ఆఫీసర్లు..
సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. నిత్యం హాస్టళ్లను పర్యవేక్షించడానికి ఒక్కో హాస్టల్ కు ఒక ప్రత్యేక ఆఫీసర్ ను నియమించారు. వీటితోపాటు జిల్లాలో ప్రతి ఆఫీసర్ తప్పనిసరిగా ఫీల్డ్ లెవల్ పర్యటనలు చేయాలనే ప్రభుత్వ ఆదేశాలపై కలెక్టర్ నుంచి పంచాయతీ కార్యదర్శుల వరకు మండలాలు, గ్రామాలను విజిట్ చేస్తున్నారు.
ప్రజా సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఆయాశాఖలకు సంబంధించిన అంశాల పరిశీలనతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులను కూడా పర్యవేక్షిస్తున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు సైతం వారంలో మూడు రోజులపాటు పర్యటనలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
విద్య, వైద్యానికి ప్రయారిటీ..
క్షేత్ర స్థాయి పర్యటనలతో ఆయాశాఖల అధికారుల పర్యవేక్షణ మరింత పటిష్టం కానుంది. విధులకు ఎగనామం పెట్టే ఉద్యోగులకు చెక్ పడనుంది. విద్య, వైద్యశాఖలకు ప్రయారిటీ ఇస్తూ పీహెచ్ సీ, సీహెచ్ సీలను నిత్యం తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఇన్నాళ్లూ ఆఫీసులకే పరిమితమైన కొందరు అధికారుల్లో వణుకు మొదలైంది. పలు శాఖల జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు కొందరు కొన్నేళ్లుగా క్షేత్ర స్థాయిలోకి వెళ్లడం మానేశారు. కేవలం ఇంటి నుంచే కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలను జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి వారికి తనిఖీలతో చెక్ పెట్టినట్లు అయిందని కొందరు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
అలసత్వం వహిస్తే చర్యలు..
అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందించాలి. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. ఫీల్డ్ విజిట్ లతో జిల్లాలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలనే దానిపై స్పష్టత వచ్చింది.
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్