- నేటి నుంచి కలెక్టరేట్ లో అమలు
- రాష్ట్రంలో సూర్యాపేటలో మొట్టమొదటి సారి
- పర్యవేక్షణకు నోడల్ ఆఫీసర్ల నియామకం
- ప్లాస్టిక్ ఉపయోగిస్తే రూ.వెయ్యి ఫైన్
సూర్యాపేట, వెలుగు: ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ కవర్లను నిషేధిస్తూ జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులకు కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యామ్నాయంగా కాగితపు సంచుల వినియోగం పెంచాలని, ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని అధికారులకు సూచించారు. మొదట కలెక్టరేట్ లో అమల్లోకి తీసుకొచ్చి ఆ తరువాత దశలవారీగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యం..
ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యంగా జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ ను నిషేధించాలని కలెక్టర్ నిర్ణయించారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదని, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, బాగ్స్, కవర్స్, ప్లేట్స్, కప్స్, గ్లాసెస్ తోపాటు ప్లాస్టిక్ సంబంధించిన వాటిని ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి కలెక్టరేట్ లో అమల్లోకి తీసుకురావాలని ఉత్తర్వులు జారీ
చేశారు.
దశలవారీగా అన్ని ఆఫీసుల్లో అమలు..
ఆగస్టు 15 నాటికి జిల్లావ్యాప్తంగా పూర్తి స్థాయిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్‌ను నిషేధించాలని అధికారులు నిర్ణయించారు. ముందుగా కలెక్టరేట్ లోని శాఖల కార్యాలయాల్లో అమలు చేయాలని, రెండో విడతలో ఆర్డీవో, ఎంపీడీవో, తహసీల్దార్ల కార్యాలయాలు, మూడో విడతలో పాఠశాలలు, వసతి గృహాలు, హాస్పిటల్స్ లో అమలు చేయనున్నారు. కలెక్టరేట్ లో వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ సంచులు ఉపయోగిస్తే సంబంధిత కార్యాలయానికి రూ.వెయ్యి జరిమానా విధించనున్నారు. ప్లాస్టిక్ నిషేధాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే నోడల్ ఆఫీసర్లను నియమించారు. జిల్లా స్థాయిలో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) సీహెచ్ ప్రియాంక, కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) బీఎస్ లత నోడల్ అధికారులుగా ఉంటారు.
ఆగస్టు 15 వరకు జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం
నేటి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ ను నిషేధించేలా ప్రణాళిక చేశాం. మొదట జిల్లా కార్యాలయం, తర్వాత ఆగస్ట్ 15 వరకు కింది స్థాయి కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తాం. ప్లాస్టిక్ నిషేధంతోపాటు స్టీల్ బాంక్ అమలు చేయాలని నిర్ణయించాం. అమలు ప్రక్రియను మానీటరింగ్ చేసేందుకు నోడల్ అధికారులను నియమించాం. - కలెక్టర్ వెంకట్రావు