సూర్యాపేట, వెలుగు : జూన్ 9న జరిగే గ్రూప్ –1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో గ్రూప్ –1 పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్–1 పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో దివ్యాంగుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. పరీక్షా కేంద్రం నుంచి స్ట్రాంగ్ రూంకు ఎగ్జామ్ మెటీరియల్ తరలించడంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
సూర్యాపేటలో ఏర్పాటు చేయనున్న 32 కేంద్రాల్లో 9,745 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మెడికల్ స్టాల్ ను ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం జూన్ 3 నుంచి 19 వరకు జరిగే బడిబాట కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, ఆర్డీవో వేణుమాధవ్, ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కో– ఆర్డినేటర్ డాక్టర్ వెంకటేశం, డీఈవో అశోక్, ఏవో సుదర్శన్ రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు
సూర్యాపేట, వెలుగు: నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ వెంకట్రావు హెచ్చరించారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని ఫర్టిలైజర్ షాపులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సరిపోయే విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే అమ్మాలని, విత్తనాలు విక్రయించేటప్పుడు కచ్చితంగా రసీదు ఇవ్వాలని చెప్పారు. అనంతరం కలెక్టట్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు, సహాయ వ్యవసాయశాఖ సంచాలకులతో విత్తనాల సరఫరాపై సమీక్షించారు.