సూర్యాపేట, వెలుగు : 2023 –-24 ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన సీఎమ్మార్ బియ్యాన్ని జూన్ 15 వరకు ప్రభుత్వానికి అందించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు మిల్లర్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి రైస్ మిల్లర్లతో సీఎమ్మార్ డెలివరీపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎమ్మార్ రైస్ డెలివరీ జూన్ 15 కల్లా పూర్తి చేయాలన్నారు. సీఎమ్మార్ బకాయి ఉన్న రైస్ మిల్లర్లు సకాలంలో అప్పగించకపోతే మిల్లులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశానికి హాజరుకాని రైస్ మిల్లుల యజమానులకు సమన్లు ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు చేయండి..
జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. పార్లమెంట్, శాసనమండలి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల సంఘం సూచనల మేరకు ఆవిర్భావ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. జిల్లాలో ఎక్కడ కూడా వేడుకల్లో కోడ్ వైలేషన్ కాకుండా చూడాలని తెలిపారు. జిల్లాలో అన్ని కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించాలని చెప్పారు.
పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉంచాలి..
గ్రూప్స్, డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉపయోగపడే పుస్తకాలు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ వెంకట్రావు సూచించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో ఆయన మాట్లాడి గ్రంథాలయంలోని వసతులపై అడిగి తెలుసుకున్నారు.