గోపాల్ పేట. వెలుగు: పోలింగ్ కేంద్రాల్లో సౌలతులు కల్పించాలని కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఆదేశించారు. శుక్రవారం వనపర్తి నియోజకవర్గంలోని గోపాల్ పేట, రేవల్లి, ఏదుల మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి సౌలతులను పరిశీలించారు. ర్యాంపులు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, విద్యుత్ తదితర ఏర్పాట్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఏర్పాట్లు చేసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు. అలాగే పాఠశాలల్లోని విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు.
ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రశ్నించారు. బుద్ధారం చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న స్టాటిస్టికల్ సర్వేలెయిన్స్ టీమ్‌తో మాట్లాడారు. తహసీల్దార్లు యాదగిరి, శ్రీనివాసులు, లక్ష్మీదేవి, ఎంఈవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
కోయిలకొండ: మండలంలోని సమస్యాత్మకమైన గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష, మహబూబ్ నగర్ ఎస్పీ హర్షవర్ధన్ పరిశీలించారు. మండలంలోని మణికొండ, మల్కాపూర్, కేశవాపూర్, గార్లపాడు, సూరారం, కోత్లాబాద్, యల్లారెడ్డిపల్లి, వింజమూరు గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్లను పరిశీలించి, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
జడ్చర్ల టౌన్: ఎన్నికల శిక్షణ తరగతులను పీవో,ఏపీవోలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జి. రవి నాయక్ కోరారు. జడ్చర్ల బీఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ ఎస్. మోహన్ రావు, డీఈవో ఏ.రవీందర్, డీఆర్డీవో యాదయ్య, తహసీల్దార్ శ్రీనివాసులు, డీపీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ మహబూబ్, ఎంఈవో మంజుల పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ టౌన్: వచ్చే నెల 3 నుంచి చేపట్టే నామినేషన్ల ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. నామినేషన్ల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్‌ను తప్పకుండా పాటించాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో వారం రోజులకోసారి సమావేశం నిర్వహించి ఎన్నికల మార్గదర్శకాలను తెలియజేయాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు కుమార్ దీపక్, కె సీతారామారావు, రిటర్నింగ్ ఆఫీసరలు వెంకట్ రెడ్డి, గోపిరాం, నర్సింగ్ రావు, ఉష, శ్రీనివాస్ బాబు పాల్గొన్నారు.