కబ్జాలను ఆపలేని అధికారులపైనా క్రిమినల్ కేసులు : కలెక్టర్​ తేజస్​నందలాల్

  • సూర్యాపేట కలెక్టర్​ ఆదేశాలు
  • గ్రీవెన్స్​కు రాని ఆఫీసర్​ సస్పెన్షన్​ 
  • సూర్యాపేటలో 89 ఫిర్యాదులు
  • యాదాద్రిలో 72, నల్గొండలో 69 ఫిర్యాదులు 

సూర్యాపేట, యాదాద్రి, నల్గొండ అర్బన్, వెలుగు : ప్రభుత్వ ఆస్తులను కాపాడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆఫీసర్లపై క్రిమినల్​ కేసులు నమోదు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్​ తేజస్​నందలాల్​ ఆదేశించారు. అలుగుకు అడ్డంగా మట్టి పోసి చెరువును ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారంటూ చివ్వెంల మండలం గుంపుల గ్రామ రైతులు గత నెల 22న ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మట్టి పోయడం వల్ల తమ పొలాల్లోని నీరు వస్తుందని తెలిపారు. దీంతో వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అదేరోజు కలెక్టర్​అధికారులకు సూచించారు. 

అయినా తహసీల్దార్, ఇరిగేషన్​ఈఈ పట్టించుకోలేదు. దీంతో సోమవారం జరిగిన ప్రజావాణికి వచ్చిన రైతులు చెరువు ఆక్రమణపై మళ్లీ ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ సీరియస్​గా స్పందించారు. చెరువును కబ్జా చేస్తుంటే ఏం చేస్తున్నారని, ఎందుకు అడ్డుకోవడం లేదంటూ ఆఫీసర్లను నిలదీశారు. కబ్జా చేస్తున్న వారే కాదు.. సంబంధింత ఆఫీసర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.  అదేవిధంగా ప్రజావాణికి రాని లేబర్ ఆఫీసర్​ను సస్పెండ్ చేయాలని ఏవో సుదర్శన్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్​లోని అన్ని డిపార్ట్​మెంట్ల స్టాఫ్​బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని చెప్పారు. ఎవరూ పర్యటనలకు వెళ్లినా రిజిస్టర్​లో ఎక్కడికి వెళ్తున్నారో నమోదు చేయాలని సూచించారు. 

సూర్యాపేటలో 89 ఫిర్యాదులు..

కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణికి 89 ఫిర్యాదులు అందాయి. ఇందులో భూములకు సంబంధించి 30 ఫిర్యాదులు వచ్చాయి. పంచాయతీ రాజ్14, డీఆర్డీవో 10, ఇతర అన్ని డిపార్ట్​మెంట్లకు కలిపి 35 ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్​అధికారులను ఆదేశించారు. 

మార్కెట్​ రేటు ప్రకారం పరిహారం ఇప్పించాలి..

యాదాద్రి, వెలుగు : భద్రాచలం- గౌరెళ్లి (ఎన్​హెచ్​930 పీ) జాతీయ రహదారి కోసం భూములు కోల్పోతున్న తమకు మార్కెట్​విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని పలువురు రైతులు యాదాద్రి జిల్లా కలెక్టరేట్​లో అధికారులను కోరారు. ఈ జాతీయ రహదారి కోసం జిల్లాలోని భూదాన్​పోచంపల్లి, వలిగొండ మండలాలకు చెందిన రైతుల నుంచి సుమారు 450 ఎకరాలను సేకరించాల్సి ఉంది.

 దీంతో భూములను కోల్పోయే పలువురు రైతులు ప్రజావాణిలో కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. బహిరంగ మార్కెట్లో ఎకరానికి రూ.2 కోట్లు ఉందని తెలిపారు. అదే విధంగా ఆలేరు మండలం శారాజీపేటలోని కురుమ కుల సంఘానికి చెందిన రెండు ఎకరాల్లో ఎకరం భూమిని ఇతరులు పట్టా చేసుకున్నారని ఫిర్యాదు చేశారు. కాగా ప్రజావాణిలో 72 ఫిర్యాదులను కలెక్టర్​ స్వీకరించారు. వీటిలో  భూసంబంధిత ఫిర్యాదులే 55 ఉన్నాయి. ఎంప్లాయిమెంట్, పంచాయతీరాజ్, అటవీ శాఖ, మున్సిపాలిటీ, శిశు సంక్షేమశాఖ, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యశాఖ, పోలీస్ శాఖలకు చెందిన ఫిర్యాదు వచ్చాయి.  

ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ.. 

నల్గొండ అర్బన్​ : కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో 69 ఫిర్యాదులను కలెక్టర్​నారాయణరెడ్డి స్వీకరించారు. ప్రజల ఫిర్యాదులను పరిశీలించి ఎప్పటికప్పుడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత సమస్యలు, ఉద్యోగ, ఉపాధి కల్పనకు సంబంధించిన సమస్యలపై 69 మంది అర్జీలు సమర్పించారు.