సీఎంఆర్ లక్ష్యాన్ని పూర్తిచేయాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సీఎంఆర్ లక్ష్యాన్ని పూర్తిచేయాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
  •     కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ 

సూర్యాపేట, వెలుగు : సెప్టెంబర్ 30 వరకు సీఎంఆర్ లక్ష్యాన్ని 100 శాతం పూర్తిచేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మిల్లర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో సివిల్ సప్లై అధికారులు, డీఆర్డీవో, డిస్ట్రిక్ కో–ఆపరేటివ్, వ్యవసాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2023–24కు సంబంధించిన రబీ, ఖరీఫ్ లకు సంబంధించిన సీఎంఆర్ లక్ష్యాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

 2024– 25 ఖరీఫ్ సీజన్ ముందస్తు ఏర్పాట్లపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. గన్ని బ్యాగుల వివరాలు, టార్ఫాలిన్, ప్యాడి క్లీనర్స్, క్లస్టర్ వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, డీసీఎస్ వోడీ రాజేశ్వర్, డీఆర్డీవో అప్పారావు, డీసీవో పద్మ, వ్యవసాయశాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, పాల్గొన్నారు. 

యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయాలి..

మేళ్లచెరువు(హుజూర్​గర్), వెలుగు : ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ కు పడిన గండ్ల పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ నీటిపారుదల అధికారులను ఆదేశించారు. హుజూర్​నగర్ మండలం బూరుగడ్డలో గండి పడిన నల్లచెరువు, కరక్కాయలగూడెంలో పూర్తయిన గండి పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. 

అధికారుల తీరుపై కలెక్టర్​ఆగ్రహం 

గరిడేపల్లి, వెలుగు : వసూలు చేసిన పన్నులను ఎలాంటి అనుమతులు లేకుండా ఖర్చు చేయడంపై కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండలంలోని తహసీల్దార్, ఎంపీడీవో, గరిడేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. పన్ను వసూళ్ల రికార్డ్స్ సరిగా లేకపోవడంపై అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

స్పెషల్ ఆఫీసర్, ఎంపీవో పర్యవేక్షణ సరిగా లేకపోవడంపై కలెక్టర్ స్పెషల్ ఆఫీసర్ సరోజ, ఎంపీవో షేక్ మౌలాన, పంచాయతీ సెక్రటరీ (కొత్త,పాత) జి.నాగేశ్వరరావు, పి.సురేశ్​కు షోకాజ్​నోటీసు జారీ చేయాలని డీపీవోను ఆదేశించారు. అంతకుముందు తహసీల్దార్ కార్యాలయంలో భూసమస్యలపై వస్తున్న దరఖాస్తులను పరిశీలించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఓటరు జాబితాపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహిస్తున్న సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. 

కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

పెన్ పహాడ్, వెలుగు : అనంతరం పెన్​పహాడ్​ తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తనిఖీ చేశారు. మండలంలో జరుగుతున్న ఇంటింటి సర్వే గురించి, ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల గురించి అడిగి తెలుసుకున్నారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాజరు పట్టికను పరిశీలించారు.