- 48 గంటల్లో రైతుల ఖాతాల్లో వడ్ల పైసలు
సూర్యాపేట, నల్గొండ అర్బన్, వెలుగు : ధాన్యం కోనుగోలు అయిన 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమచేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న వడ్లకు మద్దతు ధరపై రూ.500 బోనస్ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. జిల్లాలో పీఏసీఎస్ఆధ్వర్యంలో 63 కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 129, మెప్మా ఆధ్వర్యంలో 13.. మొత్తం 206 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
అవసరం అనుకుంటే మరిన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లపై నల్గొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నూటికి నూరు శాతం ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.