సూర్యాపేట, వెలుగు : జిల్లాలో ఉద్యానవన పంటల సాగు పెంచాలని, ఆ దిశగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో వ్యవసాయ, ఉద్యానవనశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యానవన రైతులకు ఆదర్శ రైతులతో టెక్నాలజీపై అవగాహన కల్పించాలని సూచించారు.
ఎండు మిర్చిలో నర్సరీ దశ నుంచి పంట కాలం పూర్తయ్యేవరకు రైతులకు సలహాలు అందించాలని చెప్పారు. జిల్లా, మండల స్థాయిల్లో పనిచేస్తున్న అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో పంటల నమోదు పక్కాగా ఉండాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఏడీఏ శ్రీధర్ రెడ్డి, డీహెచ్ వో నాగయ్య, ఏడీఏలు సంధ్యారాణి, జగ్గూ నాయక్, ఉద్యాన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్..
జిల్లా ప్రజా పరిషత్ పాలకవర్గం పదవీకాలం పూర్తి కావడంతో కలెక్టర్ ను ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . జడ్పీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జడ్పీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు.