
కోదాడ, వెలుగు : వేసవిలో తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కోదాడ ఆర్డీవో కార్యాలయంలో తాగునీటి సరఫరా, వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాను నిరంతరం కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో నీటి సరఫరా కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీలో బోర్ల పనితీరును పరిశీలించాలని, తప్పనిసరిగా క్లోరినేషన్ చేసిన తర్వాతనే నీటిని సరఫరా చేయాలని చెప్పారు.
అవసరమైతే లోకల్ సోర్స్ ద్వారా తాగునీరు అందించాలని తెలిపారు. ప్రతి మండలంలోని నీటి నిల్వలు, గ్రామాలవారీగా ట్యాంకులు యొక్క కెపాసిటీని అందుతున్న సరఫరాను పంచాయతీ సెక్రటరీలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, ఆర్డీవో సూర్యనారాయణ, గ్రిడ్ అధికారులు శ్రీనివాస్, అరుణాకర్ రెడ్డి, డీపీవో నారాయణరెడ్డి, డీఎల్పీవో యాదయ్య, తహసీల్దార్ వాజిద్, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఇంజినీరింగ్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.