సూర్యాపేట, వెలుగు : 35 ఏండ్లు నిండిన మహిళలందరూ ఏటా విధిగా బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో చేపట్టిన బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన 2 కే రన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదని, దీనిని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ప్రాథమిక స్థాయిలోనే వ్యాధిని గుర్తిస్తే నివారించవచ్చని తెలిపారు. 35 ఏండ్లు నిండిన మహిళలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్క్రీనింగ్ టెస్ట్ , మెమోగ్రామ్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జయలత మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్ కు ఐదు రకాల ట్రీట్మెంట్లు ఉంటాయని, దశలను బట్టి కీమోథెరపీ, రేడియేషన్ వంటి ట్రీట్మెంట్లు చేస్తున్నట్లు తెలిపారు.
అనంతరం మెడికల్ కళాశాలలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు శ్రీకాంత్ భట్, సత్యనారాయణ, రమేశ్, యశ్వంత్, ఈశ్వరమ్మ, రాకేశ్ చంద్ర, పావని, రూత్, సునీత, భూలక్ష్మి పాల్గొన్నారు.