వనపర్తి, వెలుగు: జిల్లాలో ఎస్సెస్సీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాల్లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీస్ భద్రత, బందోబస్తు ఏర్పాట్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ తదితర ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. 964 మంది విద్యార్థుల కోసం వనపర్తిలో రెండు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులు సమయానికి నడపాలని సూచించారు. సెంటర్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లు మూసి వేయించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పాల్గొన్నారు.
బడిబాటను సక్సెస్ చేయాలి
బడిబాట కార్యక్రమంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు చొరవ తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల, మన ఊరు–మనబడి కింద చేపడుతున్న పనులు, యూనిఫాం, పుస్తకాల పంపిణీ, బడిబాట కార్యక్రమంపై విద్యాశాఖ, ఇంజనీరింగ్ ఆఫీసర్లు, జడ్పీ సీఈవో యాదయ్యతో రివ్యూ నిర్వహించారు. పీఆర్ ఈఈ మల్లయ్య, డీఆర్డీవో నాగేంద్ర పాల్గొన్నారు.
పనులు నాణ్యతతో చేయాలి
పానగల్: పాఠశాలల పునః ప్రారంభం నాటికి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, పనులను నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం మండలంలోని దావాజీ పల్లి, దొండాయి పల్లి, రాయినిపల్లి గ్రామాల్లో అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. దావాజీపల్లి అంగన్వాడీ సెంటర్ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. గుడ్లు, పాలు తదితర నిల్వల వివరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. డీడబ్ల్యూవో లక్ష్మీబాయి, ఎంపీడీవో కోటేశ్వర్, ఎంపీవో రఘురాం, ఎంఈవో లక్ష్మణ్ నాయక్, పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్, ఏపీవో కురుమయ్య పాల్గొన్నారు.