సూర్యాపేట, వెలుగు : మహిళా ఉద్యోగులు స్వేచ్ఛగా పనిచేసుకోవాలని, ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడితే అంతర్గత ఫిర్యాదుల కమిటీకి తెలియజేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా సమైక్య మహిళలు, మహిళా ఉద్యోగులకు మహిళా సాధికారతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు స్వేచ్ఛగా తమ బాధ్యతలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్రంగాల్లో పనిచేస్తున్న మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు నిరోధించడానికి అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ శ్రీవాణి మాట్లాడుతూ మహిళా ఉద్యోగి ఇష్టానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్య అయిన లైంగిక వేధింపుల కిందికి వస్తుందని తెలిపారు. వేధింపులకు గురైన మహిళలు మూడు నెలలలోపు ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు. అనంతరం రిపబ్లిక్ డే ఏర్పాట్లపై కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వేడుకలు ఘనంగా నిర్వహించాలని అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో నరసింహారావు, ఏసీడీపీవో రూప, స్థానిక ఫిర్యాదుల కమిటీ చైర్మన్ శిరీష, సభ్యులు పాల్గొన్నారు.