ఎల్ఆర్ఎస్ ను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

ఎల్ఆర్ఎస్ ను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, వెలుగు : ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్ల క్రమబద్ధీకరణ చేసుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారని కలెక్టర్ తేజస్ నందలాల్​పవార్​తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ద్వారా ప్రజలకు వెసులుబాటు కల్పించిందని, దీనిని సద్వినియోగం చేసుకొని తమ ప్లాట్లను రెగ్యులరైజేషన్ చేసుకోవాలన్నారు. బుధవారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్ పై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులకు రిబేటును మినహాయిస్తూ వెంటనే ల్యాండ్ రెగ్యులైజేషన్ కు సంబంధించిన ప్రొసీడింగ్స్ జారీ చేస్తామన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలో ఇప్పటివరకు 961 మంది ఫీజు చెల్లింపులు పూర్తి చేశారని తెలిపారు. 

ఎల్ఆర్ఎస్ కింద రూ.4.88 కోట్ల రుసుం వసూళ్లు చేసినట్లు చెప్పారు. మిగతా దరఖాస్తుదారులు కూడా నిర్ణీత గడువులోపు ఎల్ఆర్ఎస్ రుసుం చెల్లించి తమ ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకోవాలని, రిబేటు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుదారుల సౌకర్యార్థం అన్ని మున్సిపాలిటీల్లో హెల్ప్ డెస్క్​లు చేశామని వెల్లడించారు. సదస్సులో అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సబ్ రిజిస్ట్రార్ అంబేద్కర్, టీపీవోలు సోమయ్య, శశికుమార్, ఆర్ వో కల్యాణి తదితరులు పాల్గొన్నారు.