- విద్యాశాఖ అధికారులపై కలెక్టర్ ఫైర్
వనపర్తి, వెలుగు: అకడమిక్ ఇయర్ ముగుస్తున్నా స్టూడెంట్లకు రెండో జత స్కూల్ యూనిఫాం ఎందుకు పంపిణీ చేయలేదని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాలోని గవర్నమెంట్ స్కూల్స్ హెచ్ఎంలు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, గురుకులాల ఆర్సీవోలు, ఎంఈవోలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
కొందరు హెచ్ఎంలు డిసెంబర్ వచ్చినా స్టూడెంట్లకు రెండో జత స్కూల్ యూనిఫాంలు ఇంకా పంపిణీ చేయలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారులపై సీరియస్ అయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, వెంటనే స్టూడెంట్లకు యూనిఫాంలు అందజేయాలని ఆదేశించారు.
జిల్లాలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు, లోపాలను సరిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. ఎఫ్ఎల్ఎన్, ఉన్నతి, లక్ష్య కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయకుండా పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఈ ఏడాది జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ను వనపర్తి పట్టణంలోని బాయ్స్ హైస్కూల్లో ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా పని చేయాలని ఆదేశించారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు. టీచర్లు అంకిత భావంతో పని చేయాలని, సంబంధిత అధికారి అనుమతి లేకుండా సెలవులో పోయినట్లు తెలిస్తే ఆ టీచర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇన్చార్జి డీఈవో నరహరి పాల్గొన్నారు.