సూర్యాపేట, వెలుగు : జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, ఆ దిశగా మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీర్లు నిబద్ధతతో పనిచేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీల్లో చేపట్టిన పనులు, అమృత్, ఎస్ బీఎం, 15 ఫైనాన్స్, పట్టణ ప్రగతి పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు పడుతున్నందున అన్ని మున్సిపాలిటీల్లో దోమల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు.
వార్డుల్లో నిరంతర పారిశుధ్య పనులు చేపట్టాలని, మున్సిపల్ సిబ్బంది డ్రెస్ కోడ్ పాటించాలని ఆదేశించారు. మున్సిపాలిటీల్లో ఇంటి, నీటి పన్ను వసూళ్లలో వేగం పెంచాలని సూచించారు. మున్సిపాలిటీల్లో లోలేవల్ ప్రాంతాలను గుర్తించి వర్షపునీరు, మురుగునీరు బయటకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, మున్సిపల్ కమిషనర్లు శ్రీనివాస్, రమాదేవి, శ్రీనివాస్, అశోక్ రెడ్డి, బుచ్చిబాబు, మున్సిపల్ ఇంజినీర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.