తుంగతుర్తి, వెలుగు : సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం నూతనకల్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు వంటి పథకాలను అర్హులైన ప్రతిఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
అంతకుముందు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మండల మహిళా సమాఖ్య శాఖలో మహిళా సంఘాలు తీసుకున్న శ్రీనిధి రుణాల రికవరీలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్డీవో, మండల ప్రత్యేకాధికారి బాలు, ఎంపీడీవో సునీత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.