వనపర్తి, వెలుగు : కార్మికులు పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించడంతో పాటు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. పారిశుధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని, ఎవరైనా చెత్త, ప్లాస్టిక్ డ్రైనేజీల్లో వేస్తే వారిని గుర్తించి ఫైన్ వేయాలన్నారు.
పారిశుధ్య కార్మికులు 15 రోజులకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ ఆవరణలో హెల్త్ క్యాంపు పెడతామని, అక్కడే వైద్య పరీక్షలు చేసుకోవాలన్నారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ మార్కెట్, టౌన్ హాల్, లలిత కళాతోరణం పనులను పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి పాల్గొన్నారు.