సూర్యాపేటను టీబీ రహిత జిల్లాగా మార్చాలి : తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేటను టీబీ రహిత జిల్లాగా మార్చాలి  :  తేజస్ నందలాల్ పవార్
  •  కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్  

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేటను టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్​లో జువారి సిమెంట్ సహకారంతో డీఎంహెచ్​వో కోట చలంతో కలిసి కలెక్టర్ టీబీ రోగులకి ఫుడ్ బాస్కెట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ రోగుల కోసం టీబీ ముక్త భారత్ అభియాన్ (పీఎం టీబీఎంబీఏ) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. 

టీబీతో ఇబ్బంది పడేవారు తప్పనిసరిగా 6 నెలలపాటు టాబ్లెట్స్ వాడాలని, మధ్యలో మందులు మానేస్తే జబ్బు తగ్గదని సూచించారు. టీబీ రోగులు ప్రోటీన్స్ తో కూడిన ఆహారం తీసుకోవడంతో జబ్బు త్వరగా తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్​వో మనోరమ, ప్రోగ్రాం అధికారిణి నజియా, పల్మానాలజిస్ట్ వెంకట పాపిరెడ్డి, జువారి సిమెంట్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఏమైనా సందేహాలుంటే ఫిర్యాదు చేయాలి.. 

ఓటరు జాబితాలోని ఫారం-6,7,8పై ఏమైనా సందేహాలుంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. బుధవారం కలెక్టర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 29 నవంబర్ 2024 నుంచి నేటివరకు కొత్తగా 4,707 మంది ఓటరుగా నమోదు చేసుకున్నట్లు తెలిపారు. వాటిని పరిశీలించి 2,927 అప్రూవ్ చేశామని, 958 రిజెక్ట్ అవ్వగా, మిగిలిన 822 పెండింగ్ లో ఉన్నట్లు వివరించారు. 

ఓటు హక్కు తొలగించమని 2,397 మంది ఫారం-7  ద్వారా అప్లై చేసుకోగా, వాటిలో 1547 అప్రూవల్ అయ్యాయని, 275 రిజెక్ట్ చేశామని, 575 పెండింగ్ లో వెల్లడించారు. ఓటర్ కార్డులో  మార్పులు, చేర్పులు కోసం 8,439 మంది ఫారం-8 ద్వారా అప్లై చేసుకున్నారని తెలిపారు. మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలిగించ్చేటప్పుడు గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించాలని చెప్పారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాంబాబు, వివిధ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.  

మట్టపల్లి నరసింహుడిని దర్శించుకున్న కలెక్టర్..

మఠంపల్లి, వెలుగు : మండలంలోని మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి వారిని బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పూర్ణకుంభతో అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ ఈవో  అనువంశిక ధర్మకర్తలు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆయన వెంట ఆర్డీవో శ్రీనివాసులు, సీఐ చరబంద రాజు, తహసీల్దార్ మంగ, అధికారులు ఉన్నారు.